రకరకాల వ్యక్తులు సమాజంలో...

కింది సంభాషణలు చదువుతుంటే ఏదో జంధ్యాల సినిమాల్లో పాత్రల్లాగా అనిపిస్తాయి;కానీ ఒకసారి జంధ్యాలగారే చెప్పారు, “తాను సినిమాల్లో సృష్టించే పాత్రలు తన నిజజీవితంలో తారసపడినవే- సినిమా కాబట్టి కొద్దిగా విశేషణాలు జోడిస్తుంటా” అని.

ఈఉపోద్ఘాతం ఎందుకంటే కింద మీరు చదవబోయే పాత్రల్లో కొన్నిగానీ, అన్నీ గానీ,కనీసం ఒక్కటన్నా గానీ మీరూ మీజీవితంలో చూసే ఉంటారు అని ఎందుకో నాకు ఓపిచ్చ నమ్మకం- ఓ వేళ మీలో ఒకటి రెండు లక్షణాలున్నా కంగారుపడొద్దు-ఒక్కోసారి మనలోవున్న కొన్ని లక్షణాలు మనకే తెలిసి చావవు-అవతలివాళ్ళు చేప్పేదాకా!

సాధారణంగా ఎవరికైనా ఒంట్లో బాలేకపొతేనో, ఏదైనా అవుతేనో పరామర్శ చేస్తాం.తెలిస్తే జాలిపడతాం,అయ్యో పాపం అనుకుంటాం!

అలా కాకుండా ఈ కింది రకంగా వ్యాఖ్యానాలు చేసే వ్యక్తుల్ని చూసారా! మచ్చుకి కొన్ని...రామానికి జ్వరం వచ్చిందట!

ఆ... జాగర్తగా ఉండకపోతే జ్వరం రాదూ (ఏమిటో జ్వరం చెప్పివస్తుందా-జాగ్రత్తగా ఉంటే మాత్రం రాదా-విడ్డూరం కాకపోతేనూ) అమితాబ్ బచ్చన్ కి, అమిత్ షాకి రాలేదా కోవిడ్ మరి!!

పక్కింటాయనకి మధుమేహం (చక్కర వ్యాధి) వచ్చిందిట! ఆ…. రాకేంచేస్తుంది స్వీట్లు గట్రా బాగా తింటూ ఉండుంటాడు (పాపం ఆ జీవి నెలకో స్వీటు ముక్క కూడా తినడు)

పాపం రామారావుగారికి కాన్సర్ ట! అయ్యో పాపం అనాలనే సంగతి మర్చిపోయి-కాన్సర్ రావడానికి కారణాలు అన్నీ ఏకరువు పెడతారు (ఇదేమైనా వికీపీడియా,గూగులా-ఎం బి.బి.ఎస్ క్లాసా?)

ఇదిగో ఇంకోళ్ళు...

సుబ్బారావుగారి అబ్బాయికి ఆక్సిడెంట్ అయ్యిందిట! ఆ. అవదూ, అంత దూకుడుగా వెళ్తాడు మరి (అసలు విషయం- ఎవడో వచ్చి గుద్దాడు ఆ అబ్బాయిని)

అంత “దూకుడు”గా ఉన్న మహేష్ బాబుకి ఎప్పుడైనా ఆక్సిడెంట్ అయిందా!! ఇదిగిదిగో ఇంకోళ్ళు...

ఆ పక్క సందులో సుబ్బారావుగారి అమ్మాయి కాలుజారిందిట! ఆ నేను అనుకుంటూనే ఉన్నా, ఇలాంటిదేదో జరుగుతుందని, ప్రతీ మాగాడితో పూసుకు తిరుగుతుంది- కాలుజారదు మరీ!

(అసలు విషయం ఆ అమ్మాయి కాలు జారి కిందపడింది- చెప్పే ఆవిడ చెప్పిన విధానం కూడా ఇలా ఉంటుంది ఒక్కోసారి) రద్దీగా ఉండే సుల్తాన్ బజార్ లో ఇలా అందర్నీ పూసుకుంటూ వెళ్లినంత మాత్రాన కాలుజారినట్టేనా-వేషాలు కాకపోతేనూ!!

ఇలాంటివే బోలెడన్ని ఉంటాయి చెప్పుకుంటూ పొతే -ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇది చదివిన తర్వాత మీకు తారసపడ్డ ఇలాంటి వ్యక్తులు గుర్తుకొచ్చివుంటారు.

డిస్క్లైమర్ (నిరాకరణ, తిరస్కరణ):
ఇందు మూలంగా నేను తెలియచేయునది ఏమనగా-ఇవి నేను రాసినవే అని అంగీకరిస్తూ ఎవర్నీ ఉద్దేశించి రాసినరాతలు కావు నావి అని మాత్రం తెలియచేస్తున్నా!

అలాగే జంధ్యాల గార్నిగానీ,వారి సినిమాల్లో పాత్రధారుల్నిగానీ కూడా.కేవలం వాటికి ఉత్తేజితుడనై (ఇన్ స్పైర్), నిమిత్తమాత్రుడనై- “నీ- నా అనే తేడా లేకుండా” రాగద్వేషాలకు అతీతుడనై(గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినట్టు) తమాషాకి రాసినవే గానీ- నాకు కనపడ్డవాళ్లలో కొందరిని ఉద్దేశించి ఏదో ఆషామాషీగా మాత్రం రాయలేదని గమనించగలరు.

ఇది చదివినవారిలో (అంతా నావాళ్ళే కాబట్టి- నీ,నా తేడాలేకుండా అని పైన రాసేశా ముందే) ఓ లక్షణంగానీ, అన్నిలక్షణాలుగానీ, కొన్నిలక్షణాలుగానీ, ఇంకా విశేషణమైన లక్షణాలు ఉన్నాగానీ(అవేవో నాకు మాత్రమే చెప్పండి)- అది పూర్తిగా యాధృచ్చికమూ, కాకతాళీయమో తప్ప వారిని ఉద్దేశించి రాసినవి మాత్రం కాదు!

గమనిక:
ఇంత చెప్పినతర్వాత కూడా నా మీద కేసు వేసే ఉద్దేశం ఉంటే- మీకే డబ్బు బొక్క, తర్వాత మీ ఇష్టం!

divider

Share your thoughts with Author!!

Spread the words out!!!